తెరాస ఉలిక్కి పడింది

SMTV Desk 2019-03-31 12:49:44  trs, farmer,

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి రైతన్నలు నామినేషన్లు వేస్తామని ప్రకటించినప్పుడు అందరూ చాలా తేలికగా తీసుకొన్నారు. నామినేషన్లు వేసిన 176 మంది రైతులలో ఒక్కరూ కూడా తమ నామినేషన్ వెనక్కు తీసుకోకపోవడంతో అన్ని పార్టీలు...ముఖ్యంగా అధికార తెరాస ఉలిక్కి పడింది. వారు నామినేషన్లు వేయడమే కాదు 176 మంది అభ్యర్ధులలో ఒకరిని ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టబోతున్నామని రైతు సంఘం ప్రతినిధులు చెప్పారు. నామినేషన్లు వేసిన రైతులందరూ శనివారం ఆర్మూరులో సమావేశమయ్యి తమ భవిష్య కార్యాచరణ గురించి చర్చించుకొన్నారు.

అనంతరం వారి ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం మా సమస్యలను పట్టించుకోకపోవడం వలననే మేము ఎన్నికలబరిలో దిగవలసి వచ్చింది. రేపటి నుంచి జిల్లాలో అన్ని గ్రామాలలో బస్సు యాత్ర చేపట్టి తెరాస సర్కారు వైఫల్యాల గురించి అందరికీ వివరిస్తాము. గ్రామస్థాయిలో బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని రైతులందరినీ కోరుతున్నాము. ఏప్రిల్ 8 లేదా 9వ తేదీన ఆర్మూరులో భారీ బహిరంగసభ నిర్వహించి దానిలో మా అభ్యర్ధిని ప్రకటిస్తాము. రైతులకు ఆగ్రహం కలిగితే ఏమవుతుందో ఈ ఎన్నికలలో మనం చూపిద్దాము. మన సమస్యలు పాలకులకు వినిపించాలంటే రైతులందరూ కలిసికట్టుగా ఉండి పోరాడాలి. జిల్లాలో రైతులు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ మన రైతు అభ్యర్ధికే ఓటువేసి గెలిపించాలని కోరుతున్నాము,” అని పిలుపునిచ్చారు.