ఎన్నికల సీజన్‌: షర్మిల ఉంగరం చోరీకి ప్రయత్నం

SMTV Desk 2019-03-31 12:48:42  sharmila, ys jagan

ఏపీలో ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఎక్కడ చూసినా ప్రచార సభలు, రోడ్ షోలతో అభ్యర్థులు, నేతలు బిజీ అయ్యారు. ఇక బహిరంగ సభలు, రోడ్‌ షోలకు భారీగా జన సమీకరణ చేస్తున్నాయి పార్టీలు. ఇక సందట్లో సడేమియా అన్నట్లు ఎన్నికల ప్రచారంలో దొంగలు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వారం క్రితమే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు దండ వేస్తున్నట్లు నటించి మెడలో చైన్ కొట్టేశారు. తాజాగా ఈ వింత అనుభవం వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిలకు ఎదురయ్యింది. నిన్న షర్మిల మంగళగిరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు.రోడ్డు పక్కన కిక్కిరిసిన వైసీపీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ, చేతులు కలుపుతూ ముందుకు సాగారు. ఆమెతో చేతులు కలిపేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. దీంతో షర్మిల కూడా కొంత ఉత్సాహంగా వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉత్సాహం నింపారు. ఇదే అదునుగా భావించిన ఓ వ్యక్తి షర్మిలకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఆమె వేలికి ఉన్న ఉంగరాన్ని కొట్టేసేందుకు ప్రయత్నించాడు. ఈ చోరీ యత్నం మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అప్రమత్తమైన షర్మిల చేయిని గట్టిగా విదిలించుకున్నారు. ఉంగరం వేలికి కాస్తా బిగుతుగా ఉండడంతో ఆ దొంగ ప్రయత్నం ఫలించలేదు. లేదంటే కొట్టేసేవాడే.