జగన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే

SMTV Desk 2019-03-31 12:42:06  jagan, Chandrababu,

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పర్యటించారు. భౌగోళికంగా రాష్ట్రానికి మొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురమని.. చివరన ఉంది కుప్పమని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు టీడీపీదే విజయమని ఆయన తెలిపారు. ఆ చివర తన నియోజకవర్గం కుప్పం.. ఈ చివరన ఇచ్ఛాపురం మొత్తం తమదేనని బాబు వెల్లడించారు. శ్రీకాకుళం అంటే వలసల జిల్లా కాదని.. వేరే జిల్లాల ప్రజలు కూడా ఉపాధి కోసం ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.

అదేవిధంగా టీడీపీకి వెనుకబడిన వర్గాలు ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. మత్స్యకారులకు ఆర్థికంగా, సామాజికంగా న్యాయం చేసే బాధ్యత తమదని వెల్లడించారు. వెనుకబడిన వర్గాల కోసం 21 కార్పొరేషన్లు పెట్టామని తెలిపిన ఆయన.. జగన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి 24 సార్లు వచ్చిన జగన్‌.. కోర్టుకు మాత్రం 248 సార్లు వెళ్లారని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకుడు కావాలా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. న్యాయం, ధర్మం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే సత్తా తనకుందని.. కేసీఆర్‌కు భయపడే ప్రసక్తే లేదని.. అలాంటి వారిని తన రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానని తెలిపారు. హైదరాబాద్‌ మాదిరిగానే అమరావతి కూడా బంగారు గుడ్డు పెట్టే బాతుగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు బీచ్‌ రోడ్డు అభివృద్ధి చేస్తామన్నారు. తొలి విడతలో ఇచ్ఛాపురం నుంచి భోగాపురం వరకు అభివృద్ధి చేసి జాతీయ రహదారికి అనుసంధానిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.