తిరుమల అడవుల్లో మంటలు

SMTV Desk 2019-03-30 18:47:31  ttd,

శేషాచలం అడవుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. గత రెండు రోజులుగా శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. చిన్నగా అంటుకున్న మంటలు చామలకోన, గాడికోన ప్రాంతాల్లో వ్యాపించాయి. నిన్న ఉదయం నుంచి టీటీడీ అటవీ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీవారి పాదాల వైపు అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపిస్తున్నాయి. రిజర్వ్‌ఫారెస్ట్ పరిధిలో మంటలు వ్యాపిస్తున్నాయి.

శ్రీవారి అలయానికి 13 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవుల్లో ప్రస్తుతం మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నించినా, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు. మరోవైపు ఫైరింజన్లు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో సుమారు 100 మందికి పైగా సిబ్బంది అతికష్టంమీద మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి ఎర్రచందనం స్మగ్లర్లే కారణమై ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు, సుమారు 5 హెక్టార్ల అటవీ ప్రాంతం ఈ మంటల్లో దగ్ధం అయిందని, అరుదైన వృక్ష, పక్షి జాతులు ఈ మంటలతో నాశనమవుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.