మిలిటరీలో ఫుడ్ బాలేదన్న జవాన్...మోడీ మీద పోటీ !

SMTV Desk 2019-03-30 18:29:54  military, jawan

బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాన్ తేజ్‌ బహదూర్ రెండేళ్ల క్రితం జవాన్లకు సరైన ఆహారం ఇవ్వడం లేదంటూ సోషల్‌మీడియాలో వీడియో పోస్టు చేసివార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి బరిలోకి దిగుతున్న వారణాశి నియోజకవర్గం నుంచి తాను కూడా పోటీ చేయనున్నట్లు తేజ్‌ బహదూర యాదవ్‌ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీలోని వారణాసి నుండి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదే నియోజకవర్గం నుండి పోటీచేసేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక సమాలోచనలు జరుపుతుండగా తాజాగా మోడీపై పోటీచేసేందుకు సిద్ధమని మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ప్రకటించారు.

తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు చెప్పగానే చాలా రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని, అయితే తాను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని వెల్లడించారు. భద్రతాబలగాల్లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడేందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బహదూర్‌ తెలిపారు. ఎన్నికల్లో గెలవడం, ఓడటం అనే విషయాన్ని పక్కన పెడితే భద్రతాబలగాలు ముఖ్యంగా పారామిలిటరీ దళాల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఈ పోటీకి దిగుతున్నానని ఆయన పేర్కొన్నారు. జవాన్ల పేరు చెప్పి ఓట్లు సంపాదించేందుకు మోదీ యత్నిస్తున్నారు, కానీ ఆ జవాన్ల కోసం ఆయన ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.