ఏపీలో 20 హైదరాబాద్‌లను అభివృద్ధి చేస్తాః చంద్రబాబు

SMTV Desk 2019-03-30 10:14:49  Chandra babu

రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

దేశ నాయకులతో మేమున్నామని చెప్పిస్తున్నా
నా వెనక మీరు ఉంటే కొండనైనా బద్దలు చేస్తా.. మీరంతా నా కోసం, రాష్ట్రం కోసం పని చేస్తున్నారు అని చంద్రబాబు ప్రజలనుద్దేశించి అన్నారు. దేశంలో ఏపీని నెంబర్ వన్‌గా చేసే బాధ్యత నాది. మీ అందరి బాధ్యత, రాష్ట్రం బాధ్యత నాది. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం వెనకే ఉండాలి. మన కోసం మొన్న ఫరూక్ వచ్చారు, నిన్న కేజ్రీవాల్ వచ్చారు. ఎల్లుండి మమత వస్తున్నారు.. తర్వాత శరద్ పవార్, దేవెగౌడ వస్తారు.

దేశంలోని అందరు నాయకులు సంఘీభావం తెలియజేస్తున్నారు. వాళ్లందరినీ మీ ముందర పెట్టి, మన సమస్యల పట్ల మేము కూడా అండగా ఉంటామని చెప్పిస్తున్నాను. జగన్ అయితే ఎవరికీ సపోర్ట్ చేయడు. కానీ మోడీ, కేసీఆర్‌లకు సపోర్ట్ చేస్తున్నాడని చంద్రబాబు అన్నారు.

నరేంద్ర మోడీతో ఢీ అంటే ఢీ అన్నానంటే.. అదంతా మీ కోసమే తమ్ముళ్లూ. మన నాయకులపై ఐటీ దాడులు చేస్తున్నారు. బీజేపీ, వైసీపీ నాయకులపై ఐటీ దాడులు లేవని చంద్రబాబు అన్నారు.

జగన్‌కు హైదరాబాద్ ముద్దు అమరావతి వద్దు
ఇంకా మాట్లాడుతూ.. కోడికత్తి పార్టీని, కేసీఆర్‌ను హెచ్చరిస్తున్నాను.. వాళ్ల అవినీతి డబ్బులు మాకు అవసరం లేదు. నేను అభివృద్ధి చేస్తుంటే కేసీఆర్ అడ్డుపడుతున్నాడు. కోడి కత్తి పార్టీని అడ్డు పెట్టుకుని మన మీద పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు అన్నారు. 88 సీట్లు గెలిచిన కేసీఆర్ ప్రతిపక్షాలను కొనేస్తున్నాడు. ఇప్పుడు 16 ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పుతాడంట. మనమీద పెత్తనం చేస్తాడు. కేసీఆర్ పెత్తనాన్ని అంగీకరిస్తారా? జగన్‌కు హైదరాబాద్ ముద్దు, అమరావతి వద్దు. ఇలాంటి పార్టీలకు ఓటేయాలా? వీళ్లు ఊరూరా నాయకులను, ఓట్లను కొంటారని చంద్రబాబు మండిపడ్డారు.

ఏపీలో 20 హైదరాబాద్‌లను అభివృద్ధి చేస్తా
కేసీఆర్‌కు బంగారు బాతును అప్పగించాం. తెలంగాణలో ఒక హైదరాబాద్ ఉంటే, ఏపీలో 20 హైదరాబాద్‌లను అభివృద్ధి చేస్తా. కేసీఆర్ కూడా మనతో రాజీ పడే రోజు వస్తుంది. మనం ఎవరికీ సరెండర్ కావాల్సిన అవసరం లేదని రావులపాలెం సభలో చంద్రబాబు అన్నారు.