ఎన్నికలున్నాయి.. వాయిదా వేయండి

SMTV Desk 2019-03-30 10:12:18  Rahul gandhi

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో జరుగుతున్న విచారణను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు విన్నవించారు. ఈ కేసు విచారణను గతంలో సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 23కు వాయిదా వేసింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున విచారణను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని వారు శుక్రవారం సుప్రీంను కోరారు.

కాగా 2011-2012 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నేషనల్‌ హెరాల్డ్‌, యంగ్‌ ఇండియా సంస్థల పన్ను రీ-అసెస్‌మెంట్‌ చేయాలని కోరుతూ ఆయా సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థల్లో ప్రధాన వాటాదారులుగా ఉన్న సోనియా, రాహుల్ ఆ నోటీసులను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పన్ను ప్రొసీడింగ్స్‌ను తిరిగి తెరిచే అధికారం ఐటీ శాఖకు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేస్తూ, వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈ నోటీసులను సవాలు చేస్తూ రాహుల్‌ సుప్రీంను ఆశ్రయించారు. కాగా ఈ సంస్థల లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2012లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.