నీరవ్‌కు రెండోసారి బెయిల్ నిరాకరణ

SMTV Desk 2019-03-30 10:09:12  Nirav Modi,

పీఎన్బీ స్కాం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి లండన్‌లోని వెస్ట్‌‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. బెయిల్ కోసం నీరవ్ రెండోసారి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి ఎమ్మా అర్బత్ నాట్ శుక్రవారం తిరస్కరించారు. నీరవ్‌కు ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే ఆయన బ్రిటన్ విడిచి పారిపోతారని చెప్పడానికి గట్టి సాక్ష్యాలు ఉన్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఈ కేసు విచారణ జరుగుతుండగానే నీరవ్ 2017లో వనౌతు అనే పసిఫిక్ ద్వీప దేశపు పౌరసత్వం పొందేందుకు చేసిన ప్రయత్నాలను న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేసిన ఎమ్మా.. ఈ సారి వాండ్స్‌వర్త్‌లోని హర్ మెజిస్ట్రీ జైలు నుంచి వీడియో లింక్ ద్వారా నీరవ్‌ను విచారిస్తామని స్పష్టం చేశారు.

ఇక విచారణలో భాగంగా భారత్ తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు న్యాయవాది టోబీ కాడ్మన్ వాదిస్తూ.. నీరవ్ మోదీకి బెయిల్ మంజూరు చేస్తే ఆయన న్యాయ ప్రక్రియకు విఘాతం కల్పించడంతో పాటు దేశం విడిచి పారిపోయే ప్రమాదముందని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రత్యక్ష సాక్షులను నీరవ్ ఫోన్‌లో బెదిరించారని, స్మార్ట్‌ఫోన్లతో పాటు సర్వర్లలో ఉన్న కీలక సాక్ష్యాలను ధ్వంసం చేయించారని కోర్టుకు విన్నవించారు.