అలెర్ట్ ...ఓటీపీతో సంబంధం లేకుండా నగదు అపహరం

SMTV Desk 2019-03-29 17:53:11  Cyber attack,

డబ్బు దోచుకునే సైబర్ నేరగాళ్ళు ఒకదారి మూసుకుపోయింది కదా అని చేతులు ముడుచుకు కూర్చోకుండా భిన్న దారులను కనుక్కుంటున్నారు. దోచుకునేవాడికి దో హజార్ దారులు అన్నట్టే చేతివాటం చూపిస్తున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల వ్యవహారంలో బ్యాంకులు ఇలాంటివాళ్లకు అవకాశం ఇవ్వకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ వారు ఇంకా తెలివిమీరిపోయి వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు మన ఖాతాలో నగదు ఉంటే ఓటీపీ వస్తుందిగా? అన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఓటీపీతో సంబంధం లేకుండా నగదు తస్కరించే సరికొత్త వ్యాలెట్లతో మాయాజాలాన్ని మొదలుపెట్టారు సైబర్‌ నేరగాళ్లు. డెబిట్‌ కార్డు ఇంటర్నెట్‌ లావాదేవీల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించే వారి ఖాతా నుంచి నగదు తస్కరిస్తున్నారు. హైదరాబాద్‌ కోఠీలోని ఓ జాతీయ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ ఖాతా నుంచి ఇలా రూ.3.17 లక్షలు స్మార్ట్‌గా దోచుకున్నారు. డబ్బు విత్‌డ్రా చేసిన సందర్భంగా నగదు తక్కువగా ఉండడంతో ఆయన ఖాతా పరిశీలించారు. ఐదు విడతల్లో తన ఖాతా నుంచి వేర్వేరు వ్యాలెట్లకు రూ.3.17 లక్షలు బదిలీ అయినట్టు గుర్తించి షాక్‌కు గురయ్యారు. దీంతో బ్యాంక్ అధికారులే వాళ్ల అతి తెలివిని చూసి నోళ్లు వెళ్లబెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడింది. బ్యాంక్‌ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించేవారు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు గమనిస్తుండాలని, వివరాలు తస్కరణకు గురికాకుండా చూసుకోవాలని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాళ్లు పేటీఎం, అమెజాన్‌, ఫ్లిప్‌కార్టు, ఈబే వ్యాలెట్ల మీద ఎక్కువగా నిఘా పెట్టి దోపిడీకి స్కెచ్ వేస్తున్నారు. ఒక్కో వ్యాలెట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల చొప్పున బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధంగా హైదరాబాదీల నుంచి రూ.80 లక్షల వరకు దోచేశారని వెల్లడైంది. ఖాతాదారులు నగదు ఈ-బదిలీ చేసేటప్పుడు సొమ్ము వ్యాలెట్‌లోకి వెళ్లకుండా బ్యాంక్‌ ‘గేట్‌వే’ 24 గంటలపాటు ఆపుతుంది. ఈలోగా ఖాతాదారుడు తాను ఆ లావాదేవీ చేయలేదంటే బ్రేక్ వేస్తుంది. దీంతో సైబర్‌ నేరగాళ్లు తక్కువ మొత్తాన్ని గేట్‌వే వేగంగా రిలీజ్‌ చేయడాన్ని గుర్తించి రూ.5 వేలు, రూ.10 వేలు బదిలీ చేసుకుని పబ్బం గడుపుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ లావాదేవీలను అనుమతించే డెబిట్‌ కార్డులపై ఉన్న టవర్‌ సింబల్‌ను సంబంధిత బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ సాయంతో డీ ఆక్టివేట్‌ చేసుకోవాలని, అలా చేసుకోని ఖాతాదారులే ఎక్కువగా ఇటువంటి మోసం బారిలో పడుతున్నారని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు.