మోదీ వర్సెస్ ప్రియాంక

SMTV Desk 2019-03-29 12:10:54  Modi, Priyanka

ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో విరివిగా రోడ్ షోలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక కీలక ప్రకటన చేశారు. ఒకవేళ హైకమాండ్ ఆదేశిస్తే ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమని ఆమె రెండు రోజుల క్రితంమే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మోదీపై బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ వారణాసి నుంచే బరిలోకి దిగుతున్న మోదీకి పోటీగా ప్రియాంక గాంధీ కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

గురువారం సోనియా గాంధీ నియోజకవర్గం రాయబరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియాంక తన ఉద్దేశాన్ని బయటపెట్టారు. ప్రియాంక రాయబరేలి నుంచే పోటీ చేయాలంటూ కార్యకర్తలు చేసిన నినాదాలకు ప్రియాంక స్పందిస్తూ.. ‘వారణాసి నుంచి వద్దా?’ అని ప్రశ్నించారు. ‘మీ ఇష్టం ఎక్కడి నుంచైనా ఓకే’ అని కార్యకర్తలు అనడంతో ‘వారణాసి నుంచి పోటీ చేయనా?’ అని మళ్ళీ ప్రశ్నించారు. ప్రియాంక చేసిన తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. వారణాసి ఎన్నికలు మోదీ వర్సెస్ ప్రియాంకగా మారడం ఖాయమని చెబుతున్నారు. మరోవైపు ప్రియాంక వ్యాఖ్యలను బీజేపీ కూడా స్వాగతించింది. వారణాసి నుంచి పోటీ చేసి తొలి పోటీలోనే ఓడిన నేతగా రికార్డు సృష్టించవచ్చని విమర్శించింది.