ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం

SMTV Desk 2019-03-29 12:09:37  dhaka,

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించగా.. మరో 70 మంది గాయపడ్డారు. బనానీ ప్రాంతంలో ఉన్న 22 అంతస్తుల భవనంలో గురువారం ఈ అగ్నిప్రమాదం జరిగింది. 8వ అంతస్తులో మొదలైన మంటలు పైకి ఎగబాకి 11వ అంతస్తు వరకు చేరి, పక్కనున్న మరో రెండు భవనాలకూ వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, వైమానిక, నౌకా దళాలు రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ఎత్తైన భవనం కావడంతో ఇంకా కొన్ని చోట్ల మంటలు చెలరేగుతున్నాయని.. వాటిని ఆర్పే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోందని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

అయితే మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొంతమంది కిటికీల్లోంచి బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు స్థానికులు తెలిపారు. చాలా మంది భవనం పైకి చేరుకోవడంతో భారీ క్రేన్లు, సైనిక హెలికాప్టర్ల సాయంతో వారిని రక్షించారు. దట్టమైన పొగలు అలముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించడం వల్లే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియరాలేదు. కాగా గత నెల ఢాకాలోని ఓ రసాయన గిడ్డంగిలో జరిగిన ప్రమాదంలో 67 మృతి చెందిన విషయం తెలిసిందే.