వైసీపీ టిక్కెట్‌పై భర్త.. స్వతంత్ర అభ్యర్థిగా భార్య పోటీ

SMTV Desk 2019-03-29 10:48:13  ycp,

రాష్ట్రంలో ప్రచార పర్వం ఊపందుకున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఈ తరుణంలో ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలకు కొదువేలేదు. కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానంలో కూడా అలంటి చిత్ర రాజకీయమే ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ నుండి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, వైసీపీ నుంచి పార్థసారథి, జనసేన పొత్తులో భాగంగా బీఎస్పీ అభ్యర్థి లంక కమలాకర్ రాజు పోటీచేస్తుండగా మరికొందరు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు.

అలా పెనమలూరు నియోజకవర్గంలో భార్యాభర్తలు ప్రత్యర్థుల్లా బరిలో దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తుండగా, ఆయన అర్ధాంగి కమల ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. కమలకు ఎన్నికల సంఘం బెల్టు గుర్తు కేటాయించింది. పెనమలూరు నుంచి ఈసారి పదిమందికి పైగా బరిలో ఉన్నారు. కాగా, పార్థసారథి, ఆయన భార్య కమల మాత్రమే కాకుండా కుమారుడు నితిన్ కృష్ణ కూడా నామినేషన్ వేసినా, స్క్రూటినీ సమయంలో తిరస్కరణకు గురైంది. లేకపోతే, ఫ్యామిలీ అంతా పెనమలూరు నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఉండేవాళ్లు అన్న మాట. కాగా,పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 13మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.