అశ్విన్ చేసింది కరెక్టే

SMTV Desk 2019-03-28 16:28:44  MCC,ashwin,

రెండు రోజులుగా ఐపీఎల్ లో జరిగిన ఒక సంఘటన మీద సర్వత్రా చర్చ జరుగుతోంది. అదేంటంటే.. పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్.. మన్కడింగ్ రనౌట్ ద్వారా జోస్ బట్లర్ ను పెవిలియన్ కు పంపించడం. ఇక ఇలా చేయడాన్ని కొంతమంది సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. అశ్విన్ చర్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కూడా తమ వాదన తెలిపారు. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా.. నిబంధనలను రూపొందించే మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) మాత్రం మన్కడింగ్ ను సమర్ధించింది. ఈ నిబంధన ఖచ్చితంగా ఉండాల్సిందేనని లేకపోతే నాన్ స్ట్రైకర్స్ తమ ఇష్టం వచ్చినట్లు క్రీజు వదిలి ముందుకు వెళ్ళిపోతారని అంటోంది ఎంసీసీ. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అశ్విన్ ఇలానే బట్లర్ ను రనౌట్ చేసి మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పిన సంగతి తెలిసిందే.

ఇలా రనౌట్ చేసే ముందు బ్యాట్స్ మెన్ కు వార్నింగ్ ఇవ్వాల్సిన నిబంధన ఏమి లేదని.. పైగా ఇది క్రీడా స్ఫూర్తికి ఏమాత్రం విరుద్ధం కాదని ఎంసీసీ తెలిపింది. ఇక అశ్విన్ బంతి వేయడానికి సిద్ధంగా ఉన్నపుడు బట్లర్ క్రీజును వదిలాడా లేదా అన్నదానిపై అతన్ని ఔట్ ఇవ్వచ్చా లేదా అన్నది నిర్ణయించవచ్చు. అయితే బట్లర్ క్రీజు వదిలి వెళ్లేలా ప్రోత్సహించడానికి అశ్విన్ కావాలనే బంతి వేయడాన్ని ఆలస్యం చేశాడని కొందరంటున్నారు. ఇది నిజమే అయితే మాత్రం అది కచ్చితంగా క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని వారి భావన. కానీ అశ్విన్ మాత్రం తానలా చేయలేదని చెబుతున్నాడు. క్రికెట్‌ను నిబంధనలకు లోబడి, క్రీడాస్ఫూర్తికి అనుగుణంగా ఆడాల్సిన అవసరం రెండు జట్లకూ ఉంది అని ఎంసీసీ తన ప్రకటనలో తేల్చి చెప్పింది