కష్టం చెప్పుకున్న రైతుకు స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడిన కేసీఆర్

SMTV Desk 2019-03-28 11:25:28  CM kcr, farmer calll,

భూమి సమస్యను సోషల్ మీడియా ద్వారా ఆవేదనతో వివరించిన ఓ యువకుడికి ఊహించని స్పందన లభించింది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. అతనికి ఫోన్ చేసి, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగంలోని అసలత్వం, అవినీతితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, మొత్తం వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.

మంచిర్యాల జిల్లా నెల్లెల మండలం నందులపల్లికి చెందిన శరత్ అనే యువకుడు తమ భూమిని వీఆర్ఓ కరుణాకర్ వేరేవాళ్ల పేరుతో మార్చి రైతు బంధు డబ్బులను లాక్కుంటున్నాడని డాక్యుమెంట్లు చూపిస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. 11 నెలలుగా అన్యాయం జరుగుతోందని, రైతుల వేదన సీఎంకు చేరే వరకూ షేర్‌ చేయాలని కోరాడు. రెవిన్యూ అధికారులపైనా ఆరోపణలు చేశాడు. ఈ వీడియో సీఎం దృష్టికి వచ్చింది. ఆయన శరత్‌కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అతని పూర్తి వివరాలు కనుక్కున్నారు. ఇది నీ సమస్య మాత్రమే కాదని, రైతులందరి సమస్యా అని చెప్పారు. స్వయంగా తన ఫోన్ నంబర్ చెప్పి పూర్తి వివరాలు ఫ్యాక్స్ చేయమని చెప్పారు. తర్వాత జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ హోలికేరి భారతి శరత్ కుటుంబాన్ని పరామర్శించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.