ఇప్పుడు భారత్‌కు కూడా ఆ శక్తి ఉంది

SMTV Desk 2019-03-28 11:18:45  Modi, mission shakthi

ప్రధాని నరేంద్రమోడీ బుదవారం మీడియా ద్వారా దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయం ప్రకటించారు. అదే...డి.ఆర్.డి.ఓ నిర్వహించిన ‘మిషన్ శక్తి’ ప్రయోగం.

“మార్చి 27 మనకు గొప్ప చారిత్రాత్మకమైన రోజు. మనం ఇప్పటికే భూమి, నీరు, ఆకాశమార్గంలో మనపై శతృదేశాలు చేసే దాడులను అడ్డుకోగల శక్తిసమార్ధ్యాలను సంపాదించుకొన్నాము. ఇప్పుడు అంతరిక్షంలో కూడా శత్రు దేశాల ఉపగ్రహాలను తునాతునకలు చేయగల సామర్ధ్యం సంపాదించుకొన్నాము. ‘మిషన్ శక్తి’ అనే పేరుతో చేసిన “ఏ శాట్” (యాంటీ శాటిలైట్) ప్రయోగం విజయవంతమైంది. ఇది తక్కువ ఎత్తులో అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని కేవలం 3 నిమిషాలలో కూల్చివేసింది.

అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాలను కూల్చగల సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు వాటి సరసన భారత్‌ కూడా నిలిచింది. ఈ ప్రయోగం ద్వారా మన శక్తి సామర్ధ్యాలను పరీక్షించుకొంటూనే అదే సమయంలో మన శక్తి సామర్ధ్యలను లోకానికి చాటిచెప్పగలిగాము. ఈ ప్రయోగం ఏ దేశానికి వ్యతిరేకంగా చేపట్టినది కాదు. అంతర్జాతీయ నిబందనలను, చట్టాలను ఉల్లంఘించకుండా మన శక్తి సామర్ధ్యాలను నిరూపించుకొన్నాము. ఇటువంటి గొప్ప టెక్నాలజీని అభివృద్ధి చేసి, అత్యంత సంక్లిష్టమైన మిషన్ శక్తి ప్రయోగాన్ని విజయవంతం చేసిన మన డి.ఆర్.డి.ఓ శాస్త్రవేత్తలను మనసారా అభినందిస్తున్నాను,” అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.