పీవోకే ప్రజల ఆందోళన

SMTV Desk 2017-08-12 18:35:39  POK, pakistan occupied kashmir, Kashmir, Azad Kashmir

పీవోకే, ఆగస్ట్ 12: మరో 3రోజుల్లో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి భారత దేశ ప్రజలంతా సిద్ధమవుతున్నారు కానీ పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో మాత్రం ప్రజలు తమ కనీస హక్కుల కోసం పోరాడుతున్నారు. పీవోకేలో కనీస అభివృద్ధి, స్వేచ్ఛ, రాజకీయ హక్కులు లేకపోవడంపై అక్కడి ప్రజలు ఆందోళన బాట పట్టారు. పీవోకే ఎంతమాత్రం పాకిస్థాన్‌ భూభాగం కాదని, ఈ విషయంలో పాక్‌ రాజకీయ నాయకులు డ్రామాలు కట్టిపెట్టాలని మండిపడుతున్నారు. పీవోకే రాజకీయ కార్యకర్త తైఫూర్‌ అక్బర్‌ మాట్లాడుతూ... రోడ్లు లేవు, ఫ్యాక్టరీలు లేవు, భావప్రకటనా స్వేచ్ఛ లేదు, ప్రజలను బానిసలుగా చూస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ యాక్షన్‌ ప్లాన్‌ పేరిట ప్రజలను అపహరించి జైళ్లలో పెడుతున్నారు అని విరుచుకుపడ్డారు. మరో పీవోకే రాజకీయ నాయకుడు మిస్ఫర్‌ ఖాన్‌ మాట్లాడుతూ... గిల్గిత్‌‌-బాల్టిస్తాన్‌, పీవోకే ప్రాంతాల్లో పాక్‌ రాజకీయ పార్టీలు చేస్తున్న దోపిడీని అడ్డుకట్ట వేయాలని ధ్వజమెత్తారు. పాక్‌ ప్రభుత్వ నీడలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పీవోకేలో గత కొన్నాళ్లుగా ప్రజల అసంతృప్తి భగ్గుమంటోంది.