కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

SMTV Desk 2019-03-27 15:25:20  ec,

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర్‌రావును ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆయన్ని హెడ్‌క్వార్టర్స్‌కు సరెండర్‌ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి ఎన్నికల బాధ్యతలు వెంకటేశ్వర్‌రావుకు అప్పగించకూడదని తెలిపింది.

వెంకటేశ్వరరావు తోపాటు శ్రీకాకుళం, కడప ఎస్పీలపై కూడా వేటు వేసింది. ఎన్నికల సంఘం ఇద్దరు ఎస్పీలను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసింది. ఏబీ వెంకటేశ్వర్‌రావు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని అనేక సార్లు ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వైసీపీ ఫిర్యాదుపై విచారణ జరిపి ఈసీ ఈమేర చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ డీజీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈసీ నిర్ణయంపై సమీక్ష చేస్తున్నారు. కొత్త ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నియామకంపై కసరత్తు చేస్తున్నారు. సీనియర్‌ అధికారుల జాబితా తయారు చేసి డీజీపీ ఈసీకి పంపనున్నారు. ఈసీ నిర్ణయం మేరకు ఏపీ సీఎస్‌.. కొత్త ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను నియమించనున్నారు.