కాంగ్రెస్ లో అంతేగా .. టిక్కెట్ ఇవ్వలేదని కుర్చీలు తీసుకెళ్లిన ఎమ్మెల్యే

SMTV Desk 2019-03-27 15:04:36  seats, congress mla,

ఎన్నికల్లో టిక్కెట్ దక్కని అభ్యర్థులు వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేస్తారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు మాత్రం టిక్కెట్ రాలేదనే కోపంతో తానూ పార్టీకోసం విరాళమిచ్చిన కుర్చీలను తీసుకొని వెళ్ళాడు. పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుల్‌ సత్తార్‌ ఔరంగాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి టిక్కెట్ ఆశించాడు. తనకే టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో ప్రచారానికీ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి క్షణంలో వివిధ కారణాల దృష్ట్యా ఆయనకు టిక్కెట్ నిరాకరించారు. ఆ స్థానాన్ని మరో స్థానిక నాయకుడు, ఎమ్మెల్సీ సుభాష్‌ ఝామ్‌బడ్‌కు కేటాయించారు.

దీంతో అబ్దుల్ సత్తార్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ భాగస్వామ్యపక్షం ఎన్సీపీతో సమావేశం ఉందని తెలుసుకున్న సత్తార్‌.. తన అనుచరులతో అక్కడికి చేరుకుని దాదాపు 300 కుర్చీలు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో వారు మరోచోట సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై మీడియా ఆయన్ని ప్రశ్నించగా.. ‘‘ ఈ 300 కుర్చీలు నేను ఏర్పాటు చేసినవి. నేను పార్టీ వీడాను. అందుకే కుర్చీలను తీసుకెళ్లిపోతున్నాను. సీటు ఎవరికైతే కేటాయించారో వారే ప్రచారానికి, సమావేశానికి ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని సమాధానం ఇచ్చారు. దీంతో విరాళంగా ఇచ్చిన కుర్చీలను తిరిగి ఎలా తీసుకుంటారంటూ అక్కడి నేతలు పెదవి విరిచారు.