నష్టపోయింది మేము.. అయినా మా మీదే నిందలేస్తున్నారు

SMTV Desk 2019-03-27 13:13:36  YS Vivekananda reddy,

తన తండ్రి వివేకా మరణం వెనుక మంత్రి ఆదినారాయణరెడ్డి కుట్ర ఉందన్న అనుమానాలు తమకు ఉన్నాయని, ఆయన్ను మాత్రం చంద్రబాబునాయుడు కాపాడుతున్నారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె.. హత్యకు సంబంధముందని సిట్ భావిస్తున్న వారిలో పలువురికి బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు. తన తండ్రి హత్య తరువాత ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు వెంటాడుతున్నాయని ఆమె చెప్పారు.

ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని, హత్య జరిగిన వెంటనే అక్కడ చేయాల్సిన తన విధులను సీఐ చేయలేదని, ఎవరి ఆదేశాల మేరకు ఆయన చూస్తుండిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ అధికారులు తమను ఎన్నో ప్రశ్నలు అడిగారని, అన్నింటికీ సమాధానం ఇచ్చామని చెప్పిన ఆమె, తాను స్వయంగా ఆదినారాయణరెడ్డిపై ఫిర్యాదు చేసినా, ఇంతవరకూ ఆయన్ను విచారించలేదని, సిట్ సైతం టీడీపీ అధీనంలోనే పనిచేస్తోందని ఆరోపించారు. తన తండ్రి హత్యతో తన కుటుంబం నష్టపోయిందని, అయినా తమపైనే నిందలేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను సీఎం చేయాలని తన తండ్రి చాలా కష్టపడ్డారని, కానీ ఆయనను హత్య చేసి దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారంటూ సునీతా అన్నారు.