శ్రీశైల పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

SMTV Desk 2019-03-27 11:15:04  srisailam,

కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. శ్రీశైల పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులపైకి లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దేవనకొండ మండలం గద్దెరాళ్ల సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మృతులంతా కర్ణాటకలోని ఎర్రగుడికి చెందిన వారుగా గుర్తించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన పోతులింగా (23), సేతు (16), ఉలిగయ్య (30) ప్రమాద స్థలిలోనే మృతిచెందగా.. దేవేందర్‌రెడ్డి, పోతప్ప, గాదెలింగ, నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో దేవేందర్ రెడ్డి, పోతప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్లక్ష్యంగా లారీ నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లారీతో సహా పరారు కాగా సంఘటనా స్థలికి 2 కిలోమీటర్ల దూరంలోని ఈదులదేవరబండ గ్రామస్థులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.