చైనాకు ముచ్చెటమలు పట్టించే ఆలోచనలో భారత్

SMTV Desk 2017-08-12 13:08:37  China, India, China media, Doklam, border issue

న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రాంతమైన డోక్లాం వ్యవహారంలో గత కొంతకాలం నుండి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చైనా తరచూ మాటలతో భారత్ ను రెచ్చగొడుతుంది. ఇప్పటి వరకు భారత్ తనదైన శైలిలో చైనా వ్యాఖ్యలకు సమాధానం చెప్పింది. అయితే చైనా ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు దీంతో చేతలతో సమాధానం చెప్పే యోచనలో భారత్ ఉన్నట్లు తెలుస్తుంది. సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలు మోహరించాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈశాన్య రాష్ట్రాల్లో భారత వాయు దళాన్ని కూడా అప్రమత్తం కావాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ ఉత్తర్వులు చైనాతో మేజర్‌ జనరల్‌ స్థాయి సమావేశాలు ముగిసిన తర్వాత జారీచేయడం విశేషతను సంతరించుకుంది. చైనా ఏదైనా దుశ్చర్యకు ప్రయత్నిస్తే తిప్పి కొట్టేందుకు భారత్ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిలోని భాగంగానే 3,488 కిలోమీటర్ల సరిహద్దులోని భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. భారత్‌ నుంచి 350 మంది సైనికులు, చైనా నుంచి 350 మంది సైనికులు మాత్రమే ప్రస్తుతం డోక్లాం ప్రాంతంలో మోహరించారు. డొక్లాంకి 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలకు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తే మంచిదని భారత సైన్యం సూచించినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్ధితుల్లో వాయుదళం సేవలను కూడా వినియోగించి ప్రత్యర్థికి ముచ్చెటమలు పట్టించాలనే యోచన మన సేనల్లో కనిపిస్తుంది.