‘మన్కడింగ్’ రనౌట్ హిస్టరీ

SMTV Desk 2019-03-26 18:37:01   Mankading, ipl 2019

మార్చ్ 26: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా రాజస్థాన్‌ తో పంజాబ్‌ కింగ్స్‌ లెవన్‌ జైపూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ‘మన్కడింగ్’ రనౌట్ చేశాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్. ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో.. రాజస్థాన్ జట్టుని విజయం దిశగా నడిపిస్తున్న జోస్ బట్లర్ (69: 43 బంతుల్లో 10x4, 2x6)ని అశ్విన్ రనౌట్ చేశాడు. అయితే దీనిపై క్రీడా అభిమానులు, విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని అశ్విన్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ‘మన్కడింగ్’ రనౌట్ విషయానికొస్తే దీని వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. ఈ విధానాన్ని తొలిసారిగా 1947-48 సీజన్ లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టులోని బౌలర్ వినూ మన్కడ్ వాడారు. ఆసీస్ ఆటగాడు బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజ్ వదిలి ముందుకు వెళ్తుండడంతో పలుమార్లు వినూ మన్కడ్ అతడ్ని హెచ్చరించాడు. అయినా బిల్ బ్రౌన్ తన వైఖరిని మార్చుకోకపోవడంతో మన్కడ్ అతన్ని రనౌట్ గా పెవిలియన్ పంపాడు. దీంతో ఈ రనౌట్ కు ‘మన్కడింగ్’ అంటూ ఆస్ట్రేలియా మీడియా పేరు పెట్టింది. ఈ విధానాన్ని అప్పట్లో ఆస్ట్రేలియా మీడియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది కూడా. అయితే అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ ఈ విధానాన్ని అంగీకరించడం కొసమెరుపు. ఈ తరహాలో అవుట్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పలువురు అంటున్నా, అప్పుడప్పుడూ క్రికెట్ లో కనిపిస్తూనే ఉంటుంది. ఈ అవుట్ కు మన్కడింగ్ అన్న పేరును తీసేయాలని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ వంటి వారు చాలాసార్లు డిమాండ్ చేశారు. ఇలా అవుట్ అయిన తొలి ఆటగాడు బిల్ బౌన్ పేరు మీద ‘బౌన్డ్’ అని పెట్టాలని లిటిల్ మాస్టర్ సూచించారు.