అమెజాన్ ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్కెట్‌ లోకి

SMTV Desk 2019-03-26 17:08:33  Amazon Atms

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు వినూత్న సేవలు అందించడానికి మరో ప్రయోగంతో ముందుకు వచ్చింది. ఇన్ని రోజులు ఆన్‌లైన్‌లో సేవలందించిన అమెజాన్ ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. మాల్స్‌లో 100 కియోస్కో మిషిన్లను ఏర్పాటు చేసి అమెజాన్ ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించింది. అమెజాన్ ఉత్పత్తి చేసే.. కిండ్లె ఈబుక్‌ రీడర్‌, ది ఎకో స్పీకర్‌, ఫైర్‌ టీవీ డోంగల్‌ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించనుంది.

ఇప్పటికే మాల్స్‌లో వాడదామనుకుంటున్న కియోస్కీలను రెండేళ్ల క్రితమే బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్‌ వంటి నగరాలలో అమెజాన్‌ పరీక్షించింది. రెండిటిని బెంగళూరులో, ఒకదానిని ముంబయి, మరో దానిని ఆహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసింది. గత వారమే నోయిడాలోని లాజిక్స్‌ మాల్‌లో ఐదో కియోస్కీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అమెజాన్‌ కియోస్కీకి దాదాపు 70-80 చదరపు అడుగుల స్థలం అవసరమవుతోంది. భవిష్యత్తును మనం అంచనావేయలేమని, కానీ ఈ ప్రయోగం ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించగలమని అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కస్టమర్లు ఈ కియోస్క్ మెషిన్ దగ్గరకు వచ్చి అందులో ఉన్న ఉత్పత్తులు ఎలా పనిచేస్తాయి పూర్తిగా తెలుసుకొని, కొనుగోలు చేయవచ్చని అమెజాన్ తెలిపింది. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధస్సు, కియోస్క్ మెషిన్లదేనని అమెజాన్ భావిస్తుంది.