నితిన్ గడ్కరీ ఆదాయం...ఐదేళ్లలో 140 శాతం పెంపు

SMTV Desk 2019-03-26 17:06:42  nitin gadkari, nominations, lok sabha

న్యూఢిల్లీ, మార్చ్ 26: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ నాగ్‌ పూర్‌ లోక్‌ సభ స్థానానికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రంతోపాటు కేంద్రఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో నితిన్ గడ్కరీ ఆదాయం గడచిన ఐదేళ్లలో 140 శాతం పెరిగింది అని వెల్లడించారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.1.96 కోట్లని, ఇప్పుడున్న రేట్ల ప్రకారం 6.9 కోట్లని పేర్కొన్నారు. ఆయన భార్య కాంచన్ ఆదాయం రూ.4.6 లక్షల నుంచి ఐదేళ్లలో రూ.40 లక్షలకు పెరిగింది. నితిన్‌ భార్య కొన్న భూములు, అపార్టుమెంట్ల ధరలు గణనీయంగా పెరిగాయని తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. గడ్కరీ సతీమణి ఆస్తులు రూ.7.3 కోట్లని వెల్లడించారు. వర్లీ ప్రాంతంలోని ఫ్లాట్ విలువ రూ.4.25 కోట్ల నుంచి రూ.3.78 కోట్లకు తగ్గింది. దీంతోపాటు 22 లక్షల బంగారు ఆభరణాలు కాంచన్ కు ఉన్నాయి. ఆయనకు ఉన్న అంబాసిడరు కారు విలువ పదివేలరూపాయలని, హోండాకారు విలువ రూ,20 లక్షలని అఫిడవిట్లలో పేర్కొన్నారు. తాను వ్యాపారంలో రూ.14.8 లక్షలను పెట్టుబడి పెట్టానని, వ్యక్తిగత రుణం రూ.1.57 కోట్లు ఉందని నితిన్‌ గడ్కరీ తెలిపారు.