డిజిటల్ న్యూస్ వైపే దేశ యువత

SMTV Desk 2019-03-26 16:42:00  digital media, digital news, india, news, news websites

మార్చ్ 26: మనదేశంలో డిజిటల్ మీడియా రోజురోజుకి కీలక అంశంగా మారుతోంది. దేశ ప్రజలందరి చూపు ఇప్పుడు డిజిటల్ మీడియా వైపే ఉంది. ఇక న్యూస్ విషయానికొస్తే దేశంలో సగం మంది స్మార్ట్ ఫోన్లలోనే న్యూస్ చదవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయం డిజిటల్ న్యూస్ రిపోర్ట్ 2019 పేరిట రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది జర్నలిజం చేపట్టిన సర్వేలో తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 68 శాతం మంది స్మార్ట్ ఫోన్లలో వార్తలు చదవడానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కానీ నేరుగా వార్తలను యాక్సెస్ చేసే వారితో పోలిస్తే.. సెర్చ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వార్తలను చదివే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 32 శాతం మంది సెర్చ్ ద్వారా, 24 శాతం మంది సోషల్ మీడియా ద్వారా వార్తల్ని పొందుతున్నారు. 18 శాతం మంది మాత్రమే డైరెక్ట్‌గా న్యూస్ యాక్సెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇంగ్లిష్‌లో వార్తలు చదువుతున్న నిర్వహించిన ఈ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆన్‌లైన్ న్యూస్ పట్ల చాలా మందిలో నమ్మకం తక్కువగా ఉంటోంది. 57 శాతం మంది తమకు లభ్యమయ్యేది తప్పుడు సమాచారం అని భావిస్తుండగా.. 51 శాతం మంది వార్తలు పక్షపాత ధోరణితో ఉంటున్నాయని భావిస్తున్నారు. 51 శాతం మంది జర్నలిజం విలువలు సరిగా లేవని చెప్పారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ వార్తలకు సంబంధించి మన దేశంలో ఇవే ప్రధాన సమస్యలని తేలింది. ఆన్‌లైన్‌లో రాజకీయాలకు సంబంధించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని 55 శాతం మంది భావిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో స్మార్ట్ ఫోన్ల ద్వారానే న్యూస్ చదివేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కానీ బ్రెజిల్, టర్నీ లాంటి దేశాలతో పోలిస్తే మన దగ్గర ఆన్‌లైన్ వార్తలను 36 శాతం మంది మాత్రమే విశ్వసిస్తున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది వాట్సాప్ వాడుతుండగా.. 75 శాతం మంది ఫేస్‌బుక్ వినియోగిస్తున్నారు. వీరిలో 52 శాతం మంది ఫేస్‌బుక్, వాట్సాప్‌లను వార్తల కోసం ఉపయోగిస్తున్నారు.