చంద్రబాబు, జగన్‌కు కొత్త తరం మీద శ్రద్ద లేదు : జనసేనాని

SMTV Desk 2019-03-26 13:04:53  Jansena, Chandra Babu, Jagan, PAwan Kalyan

వేమూరు: చంద్రబాబు, జగన్‌కు కొత్త తరం మీద శ్రద్ద లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. చంద్రబాబుకు లోకేశ్ గురించి, జగన్‌కు తన గురించి ఆలోచించుకోవడమే తప్ప, కొత్త తరం భవిష్యత్ గురించి వారిద్దరికీ ఆలోచన లేదని పవన్ విమర్శించారు. గుంటూరు జిల్లా వేమూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలని, తరతరాలు గుర్తుపెట్టుకోవాలన్నది ఆయన కోరిక.. ఇక చంద్రబాబు తన కొడుకు లోకేశ్‌ను ఎలా ముఖ్యమంత్రిని చేయాలన్న దానిపైనే ధ్యాస తప్ప వేరే దానిపై లేదని విమర్శించారు. కొత్త తరం గురించి ఆలోచన, యువతకు ఉద్యోగావకాశాలు ఎలా కల్పించాలన్న దానిపై మనసు పెట్టడం లేదని తప్పుపట్టారు.

అయితే జనసేన అధికారంలోకి వస్తే మొదటి సంతకం రైతులపైనే పెడతానని పవన్ అన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ. 5 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యేకే ప్రతి నెలా జీవితాంతం పెన్షన్ వస్తున్నప్పుడు జీవితాంతం కష్టపడే రైతుకు జీవితాంతం ఎందుకు పెన్షన్ రాకూడదని పవన్ అన్నారు. అందుకే తాము రైతు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ అన్నారు.