పవన్ టార్గెట్‌గా జగన్ వర్గం విమర్శలు

SMTV Desk 2019-03-26 10:58:01  Pawan kalyan, Jagan,

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. మాటల యుద్ధం కూడా శృతిమించుతోంది. వైసీపీ-జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విమర్శలు పడుతున్నాయి. పవన్ టార్గెట్‌గా జగన్ వర్గం భారీ విమర్శలు చేస్తోంది.

‘‘నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను.. ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తాను’’ అన్నది ఒక సినిమాలో పవన్‌ కల్యాణ్‌ డైలాగ్‌. ఆ డైలాగ్ లక్ష్యంగా వైసీపీ పవన్‌పై ఆరోపణలు చేస్తోంది. ప్యాకేజీల పవన్‌గా సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న జనసేన అధినేత తాజాగా ఎన్నికల పొత్తుల్లో ఇంతకుముందెన్నడూ లేని కొత్త ప్యాకేజీ ట్రెండ్‌ను క్రియేట్‌ చేశారని వైసీపీ అంటోంది.

చంద్రబాబును కాకుండా ప్రతిపక్షమే లక్ష్యంగా విమర్శలు చేస్తుండటం.. బాబు, పవన్‌ల కుమ్మక్కు కుట్రను సుస్పష్టం చేస్తుండగా.. అందుకు తగ్గట్లుగానే జనసేన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్‌పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నిటారుగా నిక్కచ్చిగా నిలబడాల్సిన ప్రశ్న మోచేతి నీళ్లు తాగేందుకు అడ్డంగా వంగిపోయారంటూ పవన్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ప్రశ్నిస్తా అని వచ్చిన వ్యక్తి లాలూచీ పడ్డాడు అని ఆరోపించారు.
పోలీసులాగా వ్యవహరించాల్సిన వాడు దొంగతో కలిసిపోయాడన్నారు. దోపిడి సొమ్ముకు కాపలా కుక్కలా మారిపోయారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ఇలాంటి వారిని దుడ్డుకర్రలతో వెంటపడి తరిమేస్తారన్నారు. కృష్ణాజిల్లా కైకలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ జగన్‌పై విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే. జగన్ రాయలసీమను రక్తసీమగా మార్చారని.. తాము అధికారంలోకి వస్తే రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని అన్నారు.
పులివెందుల వేషాలు తన వద్ద వేస్తే కుదరదని జగన్‌ను హెచ్చరించారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డికి కూడా ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు పవన్. ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోనని.. తాట తీస్తానని హెచ్చరించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇవాళ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఇటు పవన్ విమర్శలు-వైసీపీ నేతల ట్వీట్లతో తెలుగునేలపై ఎన్నికల వేడి మరింత పెరిగింది.