జెట్‌ఎయిర్‌వేస్‌ నుంచి తప్పుకున్న నరేశ్‌ గోయల్‌

SMTV Desk 2019-03-25 18:46:35  jet airways, banks, debts, naresh goyel, chairmen, anita goyel

న్యూఢిల్లీ, మార్చ్ 25: జెట్‌ఎయిర్‌వేస్‌ కంపెనీ బోర్డు నుంచి ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ నరేశ్‌ గోయల్‌ తప్పుకున్నారు. ఈయనతో పాటు భార్య అనితా గోయల్‌ కూడా బోర్డు నుంచి వైదొలిగారు. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా దాదాపు 25 ఏళ్ల క్రితం 1993లో గోయల్‌ తన భార్య అనితాతో కలిసి దీనిని ఏర్పాటు చేశారు. జెట్‌ఎయిర్‌వేస్‌ సంక్షోభంపై చర్చించేందుకు సోమవారం సమావేశమైన బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నరేశ్ గోయల్ బోర్డు నుంచి తప్పుకోవడంతో ఆయనకు చెందిన 51 శాతం వాటాను కన్సార్షియం సొంతం చేసుకోనుంది. జెట్ ఎయిర్‌వేస్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి సిబ్బందికి వేతనాలు చెల్లించలేకపోతోంది. పైలెట్లు ఏమో ఏప్రిల్ 1 నుంచి సమ్మె బాటపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా విమానాలు నిలిచిపోయాయి. ఎతిహాద్ ఎయిర్‌వేస్ కూడా జెట్‌లో తనకున్న 24 శాతం వాటాను విక్రయించాలని చూస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంకుల కన్సార్షియం సంస్థను గట్టెక్కించడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలన సంస్థ మళ్లీ గాడిలో పడాలంటే నరేశ్ గోయల్, ఆయన భార్య , మరో ఇద్దరు డైరెక్టర్లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌ సూచించిన సంగతి తెలిసిందే.