ఈ యాప్‌కు కాస్త దూరంగా ఉండండి : HDFC Bank

SMTV Desk 2019-03-25 17:16:16  reserve bank of india, hdfc bank, any desk app

న్యూఢిల్లీ, మార్చ్ 25: ఎనీ డెస్క్ యాప్‌పై ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇదివరకే ఈ యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఈ యాప్ ను వాడొద్దని హెచ్చరిస్తోంది. "మోసగాళ్లు కొందరు ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేసుకోమని కోరతారు. 9 అంకెల కోడ్ తమతో షేర్ చేసుకోమని అడుగుతారు. ఒక వేళ అలా చేస్తే మీ ఫోన్ హ్యాకర్ల బారిన పడుతుంది. దీంతో మీ ఖాతాలో డబ్బులు మాయమవుతాయి" అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేర్కొంది. ఎనీ డెస్క్ యాప్ ద్వారా సైబర్ కేటుగాళ్లు మీ ఫోన్‌ను ఆపరేట్ చేసే అవకాశముందని బ్యాంక్ తెలిపింది. యూపీఐ ద్వారా డబ్బులు కొట్టేసే ప్రమాదముందని హెచ్చరించింది. ఇటీవల దేశంలోని పలు నగరాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ముందుగా కేటుగాళ్లు బ్యాంక్ అధికారులమని చెబుతూ ఫోన్ చేస్తారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో సమస్యలని, వాటిని సరిచేసేందుకు ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేసుకోమని కోరతారు. తర్వాత 9 అంకెల కోడ్ చెప్పమని అడుగుతారు. పొరపాటున కోడ్ కేటుగాళ్లకి చెప్పారంటే మీ ఫోన్ వారి కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో వాళ్లు మీ ఖాతాలో డబ్బుల్ని కొట్టేస్తారు.