నామినేషన్లకు నేడే చివరి రోజు

SMTV Desk 2019-03-25 13:28:31  elections, nominations

మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సోమవారం మధ్యాహ్నం 3గంటలతో గడువు ముగియనుంది. ఆంధ్రాలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ రాష్ట్రంలో 17ఎంపీ స్థానాలకు మొదటి దశలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో 17స్థానాలకు అధికార, ప్రతిపక్షపార్టీలతో సహా ఇప్పటి వరకు 220 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేశారు.

ఈసారి నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాలలో పసుపు, ఎర్రజొన్న, సుబాబుల్ రైతులు తమ పంటలకు ప్రభుత్వం గిట్టుబాటుధర కల్పించనందుకు నిరసనగా వారు కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. చివరి రోజైన ఈరోజు భారీగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నిజామాబాద్‌లో ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్షాలు, రైతులతో కలిపి మొత్తం 61 మంది నామినేషన్లు వేశారు.

ఈవీఎంల ద్వారా గరిష్టంగా 63 మంది అభ్యర్ధులకు పోలింగ్ నిర్వహించవచ్చు. ఒకవేళ అంతకు మించి నామినేషన్లు దాఖలైతే తప్పనిసరిగా బ్యాలెట్ పత్రాలు ముద్రించి వాటితో పోలింగ్ నిర్వహించవలసి ఉంటుంది. కనుక నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాలలో రైతులకు నచ్చ జెప్పి వారిని పోటీ నుంచి విరమింపజేయడానికి తెరాస నేతలు కృషి చేస్తున్నట్లు సమాచారం.

రేపు నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. ఈనెల 28తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఏప్రిల్ 11న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో మొదటిదశ పోలింగ్ జరుగుతుంది. మే 23న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.