విచారణలో ఏం జరుగుతుందో తెలియట్లేదు : వైఎస్ సునీతా రెడ్డి

SMTV Desk 2019-03-25 13:23:05  YS Sunitha Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి రోజుకొక విషయం బయటకు వస్తోంది. అయితే విచారణ జరుగుతున్న తీరు పట్ల ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి హత్య జరిగి 10 రోజులు గడుస్తున్నా కేసులో ఒక్క క్లూ కూడా దొరకలేదని, పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. దర్యాప్తు అధికారులను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. అసలు విచారణలో ఏం జరుగుతుందో తెలియట్లేదని ఆమె పేర్కొన్నారు. నిన్న సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. హత్య జరిగిన తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శంకరయ్య తీరుపై వైఎస్ సునీత అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న తమకు వివేకాది హత్య అని అనుమానం వచ్చిందని ఘటనా స్థలంలో ఉన్న పోలీసులకు ఆ అనుమానం ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు.

హత్య కేసు నమోదు చేయాలని తెలియదా అని సునీత ప్రశ్నించారు. పోలీసులు ఏదైనా దాచే ప్రయత్నం చేశారా అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి మృతదేహానికి కట్లు కట్టడం, ఆసుపత్రికి తరలించడం అంతా సీఐ సమక్షంలోనే జరిగిందని, ఆ సమయంలో ఆయన ఎందుకు జోక్యం చేసుకోలేదు? పంచనామా జరగకుండా శవానికి కట్లు కట్టడం తప్పని ఆయనకు తెలియదా? డెడ్ బాడీని తరలిస్తుంటే సీఐ ఎందుకు చూస్తుండిపోయారు? అంటూ సునీతారెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన బంధుమిత్రులు అక్కడే ఉన్నా వారు షాక్ లో ఉండిపోయారని, కానీ, అన్నీ తెలిసిన సీఐ శంకరయ్య తన విధినిర్వహణలో ఎందుకలా ప్రవర్తించాడో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై అనవసరమైన నిందారోపణలు చేస్తున్నారని వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. వివేకా హత్య జరిగిన రోజు సీఐ శంకరయ్య తన విధులను సరిగా నిర్వర్తించలేదనే ఆరోపణలతో ఆయనపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.