ఆ హీరోలంటే ప్రేమ

SMTV Desk 2019-03-25 12:21:13  Kajal,

టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం పూర్తయినా కూడా కాజల్ క్రేజీ స్టార్‌గానే కొనసాగుతోంది. తాజాగా ఆమె తమిళ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్‌ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “తమిళ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్‌లతో కలిసి సినిమాల్లో నటిస్తున్న సమయంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. వారిద్దరు చాలా గొప్ప నటులు అయినా కూడా తోటి నటులను గౌరవిస్తారు. వారితో నటించడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

విజయ్‌తో నేను మూడు సినిమాలు చేశాను. ఇండస్ట్రీలో అత్యంత టాలెంట్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. ఆయన చాలా సహజంగా నటిస్తారు. సెట్స్‌లో ఉన్న సమయంలో విజయ్ ప్రపంచాన్ని మరిచిపోయి సినిమా గురించే ఆలోచిస్తారు. అందుకే ఆయనంటే ఒకరకమైన ప్రేమ, అభిమానం. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటాను. ఇక ‘వివేకం’ సినిమాలో నటించడానికి ముందు అజిత్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయనతో ఒక్క సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు అనుకున్నాను. అజిత్ అద్భుతమైన వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది. అందుకే అజిత్ అంటే కూడా నాకు చాలా ప్రేమ. ఆయనతో కూడా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను”అని పేర్కొంది కాజల్ అగర్వాల్.