లోకేష్ భర్త చంద్రబాబు....వైరల్ అవుతున్న నామినేషన్

SMTV Desk 2019-03-25 11:04:35  Nara Lokesh, Nomination

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు సమర్పిచిన నామినేషన్ పత్రాల్లో దొర్లిన తప్పు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కుప్పం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు, మంగళగిరి అభ్యర్థి లోకేశ్‌లు తమ ఓటు హక్కు ఎక్కడుందో తెలియజేస్తూ అధికారిక పత్రాన్ని నామినేషన్‌ పత్రాలతో జోడించారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో నివసిస్తున్న వారు అక్కడే ఓటు నమోదు చేసుకున్నారు. దీన్ని ధ్రువీకరిస్తూ తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయం జారీ చేసిన పత్రాలలో తండ్రి అనే కాలమ్‌ వద్ద భర్త అని ఇంగ్లీష్‌లో ఉంది.

దీన్ని గమనించకుండానే అధికారులు సంతకం చేసేశారు. చంద్రబాబునాయుడు నారా.. భర్త ఖర్జూరనాయుడు నారా అని ఒక పత్రంలో ఉండగా, లోకేశ్‌ నారా.. భర్త చంద్రబాబునాయుడు అని మరో పత్రంలో ఉంది. ఈ పొరపాటు అధికారుల దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వారు స్పందించి సంబంధిత ధ్రువపత్రాలను మళ్లీ మంజూరు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ తప్పిదంగా గుర్తించామని, దీని వల్ల నామినేషన్ల ఆమోదానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు. కానీ, తప్పులు ఉన్న నామినేషన్ పత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.