మూడు రోజుల్లోనే పీఎఫ్ అకౌంట్ బ‌దిలీ...!!

SMTV Desk 2017-08-11 14:20:54  EMPLOYEE, FUND, COMMISSIONER VP JOY

న్యూఢిల్లీ, ఆగష్టు 11 : మీరు ఉద్యోగం మారాలనుకుంటున్నారా? అయితే మీ పీఎఫ్ అకౌంట్ కూడా వెంట‌నే ఆటోమేటిక్‌గా బ‌దిలీ అయ్యే సౌల‌భ్యాన్ని ఈపీఎఫ్ఓ కల్పించనుంది. ఈపీఎఫ్ఓను ఉద్యోగికి అనుకూలంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ ప్రావిడెంట్ ఫండ్ క‌మీష‌న‌ర్ వీపీ జాయ్ స్పష్టం చేసారు. మీరు ఉద్యోగం మారిన వెంట‌నే పాత పీఎఫ్ అకౌంట్ అర్ధాంతరంగా మూసివేసి, కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేయడం వల్ల, పాత అకౌంట్‌లో ఉన్న మెచ్యూర్డ్ అమౌంట్ వృధా అవుతోందని జాయ్ తెలిపారు. కాగా పాత అకౌంట్‌ను కొత్త ఉద్యోగానికి బ‌దిలీ చేసుకోవడానికి అవ‌కాశం ఉన్నా కూడా ధృవీకరణ, పరిశీలన వంటి విధానాల వల్ల కొంతమంది బదిలీ చేసుకోవడానికి ఇష్టపడడం లేద౦టూ ఆయన వివరించారు. పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ తప్పనిసరి చేయడంతో ఎటువంటి ధృవీకరణ అవసరం లేకుండానే ఇప్పుడున్న ఉద్యోగం మారిన మూడు రోజుల్లోనే పీఎఫ్ అకౌంట్ కూడా ఆటోమేటిక్‌గా బ‌దిలీ అయ్యే అవకాశాన్ని కల్పించినట్లు వీపీ జాయ్ తెలిపారు. త్వరలోనే మరిన్ని సేవలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.