టైటిల్ కోసం తారస పడుతున్న మూడు జట్లు

SMTV Desk 2019-03-23 12:26:13  Title, IPL,

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమై ఇప్పటికే 11 సీజన్లు జరిగి పోయాయి. తాజాగా 12వ సీజన్‌కు శనివారం తెరలేవనుంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఐపిఎల్‌లో కొన్ని జట్లు ఇంకా ట్రోఫీని ముద్దాడలేదు. ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, చైన్నై సూపర్ కింగ్స్ జట్లు వరుస ట్రోఫీలతో సత్తా చాటగా కొన్ని జట్లు ఒక్కసారి కూడా విజేతగా నిలువలేక పోయాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ గురించే. ఆ జట్టు మూడు సార్లు ఫైనల్‌కు చేరినా ఒక్కసారి కూడా కప్పును గెలవలేక పోయింది.
భారీ ఆశలతో ఢిల్లీ
ఇక, ఢిల్లీ డేర్‌డెవిల్స్ అయితే కనీసం ఫైనల్‌కు కూడా చేరుకోలేక పోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఒక్కసారి ఫైనల్‌కు చేరినా విజేతగా నిలువలేక పోయింది. ఢిల్లీ జట్టు ప్రారంభ ఎడిషన్ నుంచి ఆడుతున్నా ఒక్కసారి కూడా ఫైనల్ సమరానికి అర్హత సాధించలేక పోయింది. హేమాహేమీ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ ప్రతిసారి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టుడం అనవాయితీగా మార్చుకుంది. కిందటి సీజన్‌లో గౌతం గంభీర్ వంటి దిగ్గజ ఆటగాడు సారథ్యం వహించినా జట్టు తలరాత మారలేదు. అత్యంత పేలవమైన ఆటతో ఢిల్లీ నిరాశ పరిచింది. ఈసారి ఢిల్లీ సరికొత్త అస్త్రాలతో బరిలోకి దిగుతోంది. ఇంతకు ముందున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరును కూడా మార్చుకుంది. ఈ సీజన్‌లో జట్టు పేరు ఢిల్లీ క్యాపిటల్స్‌గా ప్రకటించారు. ఇక, యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక, టీమిండియా స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ ఈసారి జట్టులోకి వచ్చాడు. దీంతో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా తయారైంది.

అంతేగాక ప్రపంచంలోనే అత్యంత విధ్వంసక బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న కివీస్ స్టార్ కొలిన్ మున్రో కూడా జట్టులో ఉన్నాడు. మరోవైపు భారత యువ సంచలనం పృథ్వీషా కూడా జట్టులో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. హనుమ విహారి, కొలిన్ ఇన్‌గ్రామ్‌లతో బ్యాటింగ్ బాగానే ఉంది. అంతేగాక టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా జట్టులో ఉండడం కలిసి వచ్చే అంశమే. దీనికి తోడు అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్, రూథర్‌ఫోర్ట్ వంటి ఆల్‌రౌండర్లు ఉండనే ఉన్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ట్రెంట్ బౌల్ట్, రబడాలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఇతర జట్లతో పోల్చితే ఢిల్లీ కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. ఇక, జట్టు భారమంత కెప్టెన్ అయ్యర్, సీనియర్ ఆటగాడు ధావన్, యువ సంచలనాలు పృథ్వీషా, రిషబ్, కివీస్ ఆల్‌రౌండర్ మున్రోపైనే ఆధారపడి ఉన్నాయి. వీరు మెరుగైన ఆటను కనబరిస్తే ఈ సీజన్‌లోనైనా ఢిల్లీ క్యాపిటల్స్ తలరాత మారే అవకాశాలున్నాయి. లేకుంటే మరోసారి నిరాశే మిగలడం తథ్యం.
కోహ్లి సేన ఈసారైనా
ఐపిఎల్‌లో అత్యంత బలమైన జట్టుగా పరిగణించే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడక పోవడం నిజంగా ఆశ్చరమే. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత విధ్వంసక ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న డివిలియర్స్, క్రిస్‌గేల్, కోహ్లి, మెకొల్లమ్, లోకేశ్ రాహుల్ తదితరులు జట్టుకు ప్రాతినిథ్యం వహించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటి వరకు 11 లీగ్‌లు జరిగినా బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేక పోయింది. గేల్, డివిలియర్స్, కోహ్లి, దినేశ్ కార్తీక్‌ల వంటి దిగ్గజాలు ఐపిఎల్‌లో బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు. అయినా ఆ జట్టు ట్రోఫీని సాధించడంలో ఘోరంగా విఫలమైంది. 2016లో బెంగళూరు ట్రోఫీని గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. గేల్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడం, కెప్టెన్ విరాట్ కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఫైనల్లో సన్‌రైజర్స్ ఉంచిన భారీ లక్ష్యాన్ని బెంగళూర్ అలవోకగా ఛేదించడం ఖాయమనిపించింది. కానీ, కీలక దశలో హైదరాబాద్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో ట్రోఫీని గెలిచే సువర్ణ అవకాశాన్ని బెంగళూరు చేజార్చుకుంది.

ఇక, కిందటి సీజన్‌లో బెంగళూరు అత్యంత పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. 14 మ్యాచుల్లో కేవలం ఆరింటిలో మాత్రమే విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లి, స్టార్ ఆటగాడు డివిలియర్స్ తప్ప మిగతావారు ఘోరంగా విఫలం కావడంతో బెంగళూరుకు నిరాశ తప్పలేదు. కాగా, బెంగళూరు ఓవరాల్‌గా మూడుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. ఇందులో రెండు సార్లు హైదరాబాద్ ఫ్రాంచైజీ చేతిలోనే ఓటమి పాలుకావడం విశేషం. రెండో సీజన్‌లో అప్పటి హైదరాబాద్ జట్టు డక్కన్ ఛార్జర్స్ చేతిలో బెంగళూరు ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2011లో కూడా బెంగళూరు ఫైనల్‌కు చేరింది. అయితే ఈసారి చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో పరాజయం చవిచూసింది. చివరి సారిగా 2106లో ఫైనల్లో ప్రవేశించింది. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది. తర్వాతి రెండు సీజన్లలో పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. కానీ, ఈసారి మెరుగైన ఆటతో ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇందులో ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.