పెళ్లి కాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

SMTV Desk 2019-03-23 12:24:09  marrige, suicide

ఖైరతాబాద్‌: యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెక్లెస్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. నాంపల్లి రైల్వే పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఎస్‌మక్తాకు చెందిన షేక్‌ హైదర్‌కు నలుగురు కుమారులు,ఇద్దరు కుమార్తెలు. కాగా మహమ్మద్‌ సాబేర్‌ (31) నాలుగో సంతానం. ఇతని సోదరులకి,అక్కలకు పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో సాబేర్‌ ఒంటరిగా ఉంటూ పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని పెళ్లి విషయం కుటుంబ సభ్యులెవ్వరూ పట్టించుకోకపోవడంతో శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో నెక్లెస్‌ రోడ్డులోని ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్‌లో ఎంఎంటీఎస్‌ రైలు పట్టాలపై తలపెట్టాడు. అందరూ చూస్తుండగానే అతని తల, మొండెం రెండుగా విడిపోయాయి. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.