ఖమ్మంలో 64 మంది రైతులు నామినేషన్!

SMTV Desk 2019-03-23 12:00:36  khammam constituency, loksabha elections, formers

మార్చ్ 22: ఖమ్మం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు 64 మంది రైతులు నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చారు. సుబాబుల్‌ పంట సాగుచేస్తున్న రైతులు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు తీసుకుని తమ నిరసన తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 10వేల హెక్టార్లలో రెండు జిల్లాల వ్యాప్తంగా రైతులు సుబాబుల్‌ పంట సాగుచేస్తున్నారు. పండిన పంటను ఐటీసీ కాగితం పరిశ్రమ కొనుగోలు చేస్తుంది. అయితే ఈమధ్య పరిశ్రమ రైతుల నుంచి సుబాబుల్‌ కర్ర కొనుగోలు చేయడంలో అనేక ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ధర తగ్గించింది. ఒక మెట్రిక్‌ టన్ను సుబాబుల్‌ ధర రూ.6,100గా వుండగా, మెట్రిక్‌ టన్ను ధర రూ.3 వేల నుంచి 4 వేల మధ్యనే కొనుగోలు చేస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర పెంచాలని రైతులు అధికారుల వెంట తిరుగుతున్నా వారి మొర ఆలకించే నాథుడు లేకుండాపోయాడు. దీంతో గత 6 నెలలుగా పలు రూపాల్లో ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ నేపథ్యంలోనే తమ నిరసనను నామినేషన్ రూపంలో తెలిపారు రైతులు. 200 మంది సుబాబుల్‌ రైతులు తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో మూకుమ్మడిగా నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం 64 మంది రైతులు కలెక్టర్‌ కార్యాలయంలో నామ పత్రాలు తీసుకున్నారు. ఆఖరి రోజైన సోమవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తామని వెల్లడించారు.