టీఈ పోల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియ

SMTV Desk 2019-03-22 16:28:49  te poll, lok sabha elections, telangana state government

హైదరాబాద్, మార్చ్ 22‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల్లో టీఈ పోల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నది. ఓటర్ల జాబితాలో తప్పొప్పుల సవరణ, కుటుంబ సభ్యుల ఓట్లు ఎక్కడున్నాయి చూసుకునే సౌలభ్యం పోల్‌ చీటీలను డౌన్‌లోడ్‌ చేసుకోవడం వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. ఓటర్ల సంఖ్య పెరగడం, ఎన్నికల సంఘం మార్గదర్శకాల క్రమంలో మరిన్ని పోలింగ్‌ కేంద్రాలు పెరిగే అవకాశం ఉన్నది. ఒక కుటుంబంలోని సభ్యులంతా ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ వెబ్‌సైట్‌లో ఉండేవి:

* పేరు, వయసు, చిరునామా, ఇంటి నంబర్లలో తప్పులు ఉంటే ఆన్‌లైన్‌లో సవరించుకోవచ్చు. తమ కుటుంబ సభ్యుల పేర్లన్నీ ఒకే పోలింగ్ బూత్‌లో ఉన్నయా? లేదో పరిశీలించుకోవచ్చు. సవరణలకు ఆన్‌లైన్‌లో వెసులుబాటు కల్పించారు.
* నియోజకవర్గాల వారీగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు, పోలింగ్ కేంద్రాలకు ఎలా వెళ్లాలి, తదితర వివరాలు తెలుసుకోవచ్చు.
* గత ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్ల జాబితా కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం రూపొందించిన వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఓటరు జాబితాను ఆన్‌లైన్ నుంచి తీసుకోవచ్చు.
* ఓటర్లు పోల్ చీటీలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* అభ్యర్థులు రోజువారీ ఎన్నికల ఖర్చు వివరాలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే సరిపోతుంది. ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగుల జాబితా గతంలో అధికారుల వద్దనే ఉండేది. ప్రస్తుతం ఆ జాబితాను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
* ఎవరు, ఎక్కడ విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల నిర్వహణలో వారి హోదా తదితర వివరాలను తెలుసుకోవచ్చు.
* వెబ్‌సైట్‌లో పలు విభాగాలు ఉన్నాయి. ఎన్నికల నియమావళితో పాటు అభ్యర్థులు, ఓటర్ల వివరాలకు సంబంధించిన విభాగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
* అభ్యర్థుల దరఖాస్తు పత్రాలు, అఫిడవిట్లు, ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల నిర్వహణ తేదీలను ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.