బీజేపీ లోకి ప్రముఖ క్రికెటర్ గంభీర్

SMTV Desk 2019-03-22 14:06:01  BJP, Cricketer, Gambhir

టీమిండియా మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ నేడు బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. కేంద్ర మంత్రులు అరుణ జైట్లీ మ‌రియు రవిశంకర్‌ ప్రసాద్‌ల సమక్షంలో గంభీర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా గంభీర్ మాట్లాడుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పూర్తితో తాను బీజేపీలో చేరానని., దేశానికి సేవ చేసేందుకు బీజేపీ ఓ అద్భుత వేదిక అని అభివ‌ర్ణించారు. ఇటీవ‌లే ప‌ద్మ శ్రీ అవార్డును పొందిన గంభీర్ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో పంజాబ్‌లోని అమృత‌స‌ర్ నుంచి పోటీ చేసిన జైట్లీకి ప్రచార క‌ర్త‌గా ఉన్నారు. మొద‌టి నుంచి దేశ స‌మైక్య‌త మ‌రియు సంస్కృతి గురించి మీడియాలో ప‌లు ర‌కాలుగా స్పందించే గంభీర్ గ‌తంలోనే బీజేపీలో చేరుతున్న‌ట్టు ప‌లు వార్త‌లోచ్చాయి. వాటిన్నింటిని నిజం చేస్తూ గౌతీ నేడు కేంద్ర మంత్రుల స‌మ‌క్షంలో క‌మ‌ల‌ద‌ళంలో చేరారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గంభీర్‌ ఢిల్లీ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.