కేసీఆర్‌ ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటారు

SMTV Desk 2019-03-22 12:35:19  KCR,

తెరాస సిట్టింగ్ ఎంపీలలో టికెట్ లభించనివారిలో మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ కూడా ఒకరు. ఆయన స్థానంలో మాలోతు కవితకు సిఎం కేసీఆర్‌ టికెట్ కేటాయించారు.

దీనిపై మీడియా ప్రతినిధులు ఆయన తదుపరి కార్యాచరణ గురించి ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, “కేసీఆర్‌ ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకొంటారని అందరికీ తెలుసు. నా విషయంలో ఆయన తీసుకొన్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. టికెట్ లభించలేదు కదా అని వేరే పార్టీలో చేరే ఉద్దేశ్యం నాకు లేదు. ఎందుకంటే నేను పదవులు, అధికారం కోసం ఆశపడి రాజకీయాలలోకి రాలేదు. తెలంగాణ సాధన కోసం పోరాడుతూ రాజకీయాలలోకి వచ్చాను. భగవంతుని దయ వల్ల నాకు అన్నీ లభించాయి. నేను చాలా సుఖంగా, గౌరవంగా జీవిస్తున్నాను. మహా అయితే మరో 10-15 ఏళ్ళు రాజకీయాలలో కొనసాగగలనేమో? కనుక పదవుల కోసం పార్టీలు మారి నా గౌరవానికి భంగం కలిగించుకోలేను. ఇతర పార్టీలు నాకోసం తలుపులు తెరిచే ఉంచినప్పటికీ నాకు ఆసక్తిలేదు. కడదాక తెరాసతోనే కొనసాగుతాను. కేసీఆర్‌ నా సేవలను వాడుకొంటారనే భావిస్తున్నాను. నేను వేరే పార్టీలో చేరుతున్నానని మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. నేను ఇతర పార్టీలతో సంప్రదింపులు చేయడంలేదు. కావాలనుకొంటే మీడియా నా ఫోన్ ట్యాప్ చేసి తెలుసుకోవచ్చు,” అని అన్నారు.