ఓట్ల కోసం జవాన్లను చంపారు

SMTV Desk 2019-03-22 12:30:01  Pulwama,

లక్నో : పుల్వామా ఉగ్రదాడి ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్ గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు సంపాదించుకునేందుకు పుల్వామా దాడి ‘కుట్ర’ పన్నారని ఆరోపించారు. ఆ ఘటనను ‘పుల్వామా ఓట్ల కుట్ర’గా ఆయన అభివర్ణించారు. గత ఫిబ్రవరి 14న సీఎర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడి తమ పనేనంటూ జైషే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. హోలీ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, పుల్వామా దాడి వెనుక నిజం ఏమిటనే దానిపై విచారణ జరగాల్సి ఉందన్నారు. కేంద్రంలో మార్పులు అంటూ జరిగితే చాలా పెద్ద నేతల పేర్లే ఈ ఘటనలో బయటకు వస్తాయని అన్నారు. ప్రభుత్వం పట్ల పారామిలటరీ బలగాలు అసంతృప్తితో ఉన్నాయని, ఓట్ల కోసం జవాన్లను చంపారని దుయ్యబట్టారు. జమ్మూ, శ్రీనగర్ మధ్య హైవేలో తనిఖీలు లేకుండా జవాన్లను సాధారణ బస్సుల్లో పంపడమేంటని ప్రశ్నించారు. ఇదంతా కుట్రలో భాగమేనని, కేంద్రంలో తరువాత ప్రభుత్వం మారితే దీనిపై విచారణ జరిగినప్పుడు పెద్ద పెద్ద వాళ్ల పేర్లే బయటకు వస్తాయని అని రామ్ గోపాల్ యాదవ్ జోస్యం చెప్పారు. రాంగోపాల్ వ్యాఖ్యలపై యుపి సిఎం యోగి మండిపడ్డారు. సైనిక బలగాల ఆత్మ స్థైర్యాన్ని ఇలాంటి మాటలు దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.