నారాలోకేష్ కు భారీ షాక్

SMTV Desk 2019-03-22 12:19:03  Nara Lokesh,

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. నమ్ముకున్న పార్టీలో టికెట్ దక్కకపోవడంతో ఎవరు ఎప్పుడు అసహనంతో వేరే పార్టీలో చేరుతారో ఊహించడం అసాధ్యంగా మారింది. అప్పటివరకు పార్టీ తమకు టికెట్ ఇస్తుందని భజన చేసినవాళ్లు వేరే పార్టీలో చేరి ప్రత్యర్థులుగా మారి వాడివేడి విమర్శలతో ఫిడేలు వాయిస్తున్నారు. గెలిపిద్దామనుకున్న పార్టీని ఓడించాలని అంటున్నారు. అలాంటి ఘటనే ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు ఎదురైంది. గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గురువారం వైఎ‍స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆమె కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. తమ కుటుంబానికి టికెట్‌ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, అందుకే తాను వైసీపీలో చేరినట్టు చెప్పారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా కాండ్రు కమల వైసీపీ తరఫున బరిలో నిలబడుతున్నారు.

‘మంగళగిరి స్థానాన్ని బీసీలకు కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. నమ్మించి మాట తప్పినందుకు నిరసనగా టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరాను. టీడీపీని ఓడించడానికి అందరూ పనిచేయాలి. బీసీలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారు. చంద్రబాబు మోసాల పట్ల బీసీలు అప్రమత్తంగా ఉండాలి’ అని ఆరోపించారు కమల. ఇప్పుడు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం మరింత హాట్ హాట్‌గా మారింది. వైసీపీ తరఫున కమల గెలుస్తారా, టీడీపీ తరఫున నిలబడ్డ లోకేష్ గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.