మరోసారి ప్రయోగం చేయనున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌

SMTV Desk 2019-03-22 12:02:06  Kkr Sunil Narine Is Back After Injury Ipl 2019, Kolkata Knight Riders, KKR vs SRH

మార్చ్ 21: ఐపీఎల్‌ 2019 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీమ్ మరోసారి ప్రయోగాలూ చేయనున్నట్లు సమాచారం. 2018 సీజన్‌లో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను ప్రయోగాత్మక ఓపెనర్‌గా కోల్‌కతా ఆడించగా.. అతను ప్రొఫెషనల్ ఓపెనర్‌ కంటే మెరుగ్గా రాణించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బ్యాట్‌తోనే కాదు.. బంతితోనూ రాణించిన ఈ మిస్టరీ స్పిన్నర్ 17 వికెట్లు పడగొట్టి.. ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు మొదలుకానుండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఇటీవల గాయపడిన సునీల్ నరైన్.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (పీఎస్‌ఎల్)కి కూడా దూరంగా ఉన్నాడు. దీంతో టీమ్ తమ ఓపెనింగ్‌ జోడీలో మరోసారి ప్రయోగాలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే అతని చేతి వేలికి గాయమవడంతో క్రికెట్‌కి దూరంగా ఉంటున్న నరైన్.. తాజాగా ఫిట్‌నెస్ సాధించినట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్ బౌలింగ్‌ కోచ్ కార్ల్ క్రో వెల్లడించాడు. ‘అవును.. చేతి వేలి గాయం కారణంగా పీఎస్‌ఎల్‌ టోర్నీకి నరైన్ దూరంగా ఉన్నాడు. కానీ.. ఇప్పుడు అతను ఫిట్‌నెస్ సాధించాడు. 2019 సీజన్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనని మనం చూడబోతున్నాం. ఈసారి బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ అతను మెరుపులు మెరిపించనున్నాడు’ అని క్రో ధీమా వ్యక్తం చేశాడు.