టీడీపీ హస్తం ఉందని తేల్చితే ఏ శిక్షకైనా సిద్ధమే

SMTV Desk 2019-03-22 11:57:52  Adi narayana Reddy, viveka hathya,

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శలు సంధించారు. హత్యతో తనకు సంబంధం ఉన్నట్టు తేలితే నడిరోడ్డులో తనను రాళ్లతో కొట్టి చంపాలని అన్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన శవాన్ని బాత్రూమ్ కు తరలించి, ఇంట్లోని రక్తాన్ని తుడిచేసి, డాక్టర్ ను పిలిపించి శవానికి కుట్లు వేశారని తెలిపారు. శరీరం మొత్తానికి గుడ్డ చుట్టారని చెప్పారు. ఆ తర్వాత హఠాత్తుగా గుండెపోటుతో వివేకా చనిపోయారంటూ బ్రేకింగ్ న్యూస్ ను వదిలారని అన్నారు.

జగన్, అవినాశ్ రెడ్డిల కనుసన్నల్లోనే వివేకా హత్య జరిగిందని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. కేసుకు సంబంధించి సీబీఐ విచారణను కోరడం విడ్డూరంగా ఉందని చెప్పారు. హత్య జరిగినట్టు క్లియర్ గా కనపడుతుంటే గుండెపోటు అని ప్రచారం చేశారని ఆదినారాయణరెడ్డి విమర్శించారు ఏది చెబితే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లనుకున్నారా? అని అన్నారు. వివేకానందరెడ్డిది హత్య అని తెలిసినా.. ఎందుకు రాజకీయ డ్రామాలాడారని విమర్శించారు. చంద్రబాబుపై, తనపై నిందలు వేశారని, వివేకా హత్యలో టీడీపీ హస్తం ఉందని తేల్చితే ఏ శిక్షకైనా సిద్ధమేనని ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు.

రాష్ట్ర సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకురావాలని యత్నిస్తున్నారని చెప్పారు. టీడీపీకి 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని... రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆదినారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.