ఐటీ గ్రిడ్స్ కేసు వచ్చే బుధవారానికి వాయిదా

SMTV Desk 2019-03-22 11:57:00  Data breach, AP, TS

ఐటీగ్రిడ్స్‌ కేసుకు సంబంధించిలో తెలంగాణ హైకోర్టులో ఈరోజు చాలా వేడిగా వాదనలు సాగాయి. డేటాచోరీ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీగ్రిడ్స్‌ సంస్థ యజమాని ఆశోక్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్‌ లూత్రా కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ డేటాపై తెలంగాణకు ఏం సంబంధం లేదని, కేసుపై విచారించే హక్కు ఇక్కడి పోలీసులకు లేదని కూడా ఆయన వాదించారు. ఒకే కేసుపై రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారని.. ఇందులో రాజకీయ దురుద్దేశం తప్ప మరొకటి లేదని ఆయన కోర్టుకు తెలిపారు. కేసులో సిట్‌ తరఫున తెలంగాణ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కౌంటర్‌గా కోర్టులో వాదనలు వినిపించారు.

కాగా ఐటీగ్రిడ్స్‌ కంపెనీ ద్వారా డేటాచోరీ జరిగినట్లు తమవద్ద ఖచ్చిమైన ఆధారాలు ఉన్నాయని తెలంగాణ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఆ కంపెనీ ఇదే రాష్ట్రంలో ఉండటంతో ఇక్కడ విచారించే హక్కు తెలంగాణ పోలీసులకు ఉందని స్పష్టం చేశారు. అలాగే.. ఏపీ డేటా మాత్రమే కాకుండా తెలంగాణ డేటా కూడా చోరీ అయిందని ఆయన కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు ఇన్న తెలంగాణ హైకోర్టు తర్వాతి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తానికి అశోక్ మాత్రం కోర్ట్ కు హాజరు కాకపోవడం విశేషం.