దిగ్గజ డీటీహెచ్ కంపెనీ ఆవిర్భావానికి రంగం సిద్దం?

SMTV Desk 2019-03-22 11:56:13  airtel dth, dish tv, reliance jio

మార్చ్ 21: టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలియన్స్ జియో ఇప్పుడు డీటీహెచ్ వ్యాపారంలోనూ అదే జోరుతో దూసుకెళ్లాలని చూస్తోంది. రిలయన్స్ దెబ్బకు ఎయిర్‌టెల్, డిష్ టీవీలకు ఇప్పటికే వణుకు ప్రారంభమైంది. అందుకే రెండు కంపెనీలు చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఎయిర్‌టెల్ డీటీహెచ్, డిష్ టీవీలు వాటి డీటీహెచ్ వ్యాపారాలను విలీనం చేసే దిశగా చర్చలు జరుపుతున్నాయని ఒక ఆంగ్ల ఛానల్ పేర్కొంది. ప్రస్తుతం చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకలాపాల స్థిరీకరణ, రిలయన్స్‌కు గట్టి పోటీ అనేవి చర్చల ప్రధాన లక్ష్యమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిర్‌టెల్ డీటీహెచ్, డిష్ టీవీ రెండు కలిపిపోతే దిగ్గజ డీటీహెచ్ కంపెనీ ఆవిర్భవిస్తుంది. హాత్‌వే కేబుల్ అండ్ డేటాకమ్, డెన్ నెట్‌వర్క్స్‌లో రిలయన్స్ వాటాలు కొనుగోలు చేయడమే ఇందుకు ఆజ్యం పోసిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. టెలివిజన్, బ్రాడ్‌బాండ్ కార్యకలాపాల కోసం రిలయన్స్ వీటిల్లో వాటాలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.