ఐపీఎల్‌ను పాకిస్థాన్‌లో ప్రసారం చేయనివ్వం : పాక్

SMTV Desk 2019-03-22 11:55:27  ipl 2019, pakistan, india, pulwama attack, psl, minister favad ahmedd

ఇస్లామాబాద్, మార్చ్ 21: పుల్వామా ఉగ్రదాది కారణంగా భారత్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మ్యాచ్‌ ప్రసారాలను డీస్పోర్ట్స్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి ప్రతీకగా శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానున్న సందర్భంగా ఈ టోర్నీ మ్యాచ్‌లు పాక్‌లో ప్రసారం చేయడానికి వీల్లేదని ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్ అహ్మద్ చౌదరీ హుకం జారీ చేశాడు. పుల్వామా దాడి జరిగినప్పటి నుండి టోర్నీ ముగిసే వరకూ అంటే మార్చి 17 వరకూ పీఎస్‌ఎల్ మ్యాచ్‌లను భారత్‌లో డీస్పోర్ట్స్, ఐఎంజీ రిలయన్స్‌ ప్రసారం చేయలేదు. దీంతో అప్పట్లో ఘాటు విమర్శలు గుప్పించిన పాకిస్థాన్‌.. ఇప్పుడు బదులు తీర్చుకోవడానికి సిద్ధపడుతోంది. ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ 2008లో పాకిస్థాన్ క్రికెటర్లను టోర్నీలో ఆడేందుకు అనుమతిచ్చిన భారత్.. ముంబయి దాడుల తర్వాత వారిని ఐపీఎల్‌లోకి అనుమతించడం లేదు. దీంతో.. గత పదేళ్లుగా ఐపీఎల్‌కి దూరంగానే పాక్ క్రికెటర్లు ఉంటున్నారు. ‘పీఎస్‌ఎల్ సమయంలో భారత్‌కి చెందిన ప్రసార కంపెనీలు, ప్రభుత్వం పాకిస్థాన్‌ క్రికెట్‌పై వివక్ష చూపాయి. ఇప్పుడు మేము ఎందుకు ఐపీఎల్‌ని ఉపేక్షించాలి. మేము రాజకీయాల్ని, క్రికెట్‌ను కలపకూడదని అనుకున్నాం. కానీ.. భారత్ జట్టు ఆస్ట్రేలియాపై ఆర్మీ క్యాప్‌లు ధరించి మరీ మ్యాచ్ ఆడింది. దీనిపై ఐసీసీ నుంచి ఎలాంటి చర్యలూ లేవు. ఐపీఎల్‌ను పాకిస్థాన్‌లో ప్రసారం చేయనివ్వకపోతే.. అది కచ్చితంగా భారత క్రికెట్‌కి నష్టం చేకూరుస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్ ఓ సూపర్ పవర్’ అని చౌదరీ వెల్లడించాడు.