బాంబుల పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్‌

SMTV Desk 2019-03-22 11:28:48  Kabul, Kabul Bomb, afghanistan, kabul bomb blasting

అఫ్గానిస్థాన్‌, మార్చ్ 21: రాజధాని కాబూల్‌ లో గురువారం ఉదయం బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ సంఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పెర్షియల్ నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. అయితే ఈ వేడుకలు ఆ దేశ మత సంప్రదాయాలకు వ్యతిరేకమనే భావనతోనే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కొందరు ఉగ్రవాదులు మోర్టార్‌ బాంబులతో దాడులకు దిగారని అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఈ బాంబు దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. కాబూల్ లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని రక్షణ శాఖ వెల్లడించింది. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్ర సంస్థ ప్రకటన చేయలేదు. అయితే ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో షియా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఐఎస్‌ ఉగ్ర సంస్థ దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం నాటి దాడులు కూడా అదే సంస్థకు చెందిన ఉగ్రవాదులు జరిపి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.