పార్టీని వీడి వెళ్ళిపోయినా నష్టం లేదు

SMTV Desk 2019-03-21 17:27:53  TRS,

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు బుదవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “తెరాసలో చేరుతున్న ఎమ్మెల్యేలు అందరూ మీరు చెప్పమన్నట్లే నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నామని చిలకల్లా పలుకుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తెరాసలో చేరితేనే వారి నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తారా లేకుంటే చేయరా? మీరు (కేసీఆర్‌) తెలంగాణ రాష్ట్రం అంతటికీ ముఖ్యమంత్రా లేక తెరాస ఎమ్మెల్యేలకు మాత్రమేనా?మీకు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం ఉన్నా ముందుగా మా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేస్తున్నాము. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ త్వరలోనే షోకాజ్ నోటీసులు జారీ చేసి వారిపై అనర్హత వేటు పడేందుకు చట్టపరంగా చర్యలు తీసుకొంటాము. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒడిదుకులను ఎదుర్కొని తట్టుకొని నిలబడే శక్తి ఉంది. కనుక ఎంతమంది ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయినా నష్టం లేదు. మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొని తెరాసను ఎదుర్కొంటాము.

మీకు 15మంది ఎంపీలు ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్రమోడీతో ఎంతో సఖ్యతగా ఉన్నప్పటికీ గత 5 ఏళ్ళలో విభజన హామీలు ఎందుకు సాధించలేకపోయారు?అప్పుడు సాధించలేనిది ఇప్పుడు 16 ఎంపీలతో ఏవిధంగా సాధిస్తారు? ఈవిధంగా మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేసే మీకు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే, రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదాతో పాటు విభజన హామీలను అన్నిటినీ అమలుచేయిస్తాము,” అని అన్నారు.

జానారెడ్డి మాట్లాడుతూ,”రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీయే ఉండకూడదనే దురుదేశ్యంతోనే ఫిరాయింపూలను ప్రోత్సహించడం చాలా దారుణం. ఇటువంటి అప్రజాస్వామ్య విధానాలు, నిరంకుశవైఖరి సరికాదు. ప్రజలు మీ చర్యలను గమనిస్తూనే ఉన్నారని మరిచిపోవద్దు. ఇవాళ్ళ మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తే రేపు ప్రజలు మిమ్మల్ని అధికారలో లేకుండా చేస్తారు,” అని అన్నారు.