ఎంపీ అభ్య‌ర్ధిగా బుట్టా రేణుక‌..?

SMTV Desk 2019-03-21 15:55:46  butta renuka,

గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై క‌ర్నూలు ఎంపీగా గెలుపొందిన బుట్టా రేణుక ఆ త‌రువాత సీఎం చంద్ర‌బాబు స‌మక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకుంది. మ‌రో 22 రోజుల్లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఆమె మ‌ళ్లీ వైసీపీ పంచ‌న చేరారు. ఈ అంశ‌మే ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తోంది. స‌రిగ్గా అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌కు ఒక‌రోజు ముందు మాత్ర‌మే బుట్టా రేణుక వైసీపీలోకి రావ‌డ‌మేంట‌బ్బా అంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం ఆశ్చ‌ర్య‌పోయారు.

అయితే, జ‌గ‌న్ చేత వైసీపీ కండువా క‌ప్పించుకున్న బుట్టా రేణుక టికెట్ కోసం తాను పార్టీలో చేర‌లేదని చెప్పారు. ఎన్నిక‌ల త‌రుణంలో తాను వైసీపీ అభ్య‌ర్ధుల గెలుపు కోస‌మే ప‌నిచేస్తాన‌ని చెప్పారు. కానీ, అదంతా మీడియా ముందు మాత్ర‌మేన‌ని, తెర‌వెనుక మాత్రం ఎంపీ టికెట్ కోసం ముమ్మ‌ర ప్ర‌యత్నాలు జ‌రుగుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఎంపీ టికెట్ కోసం స్కెచ్ గీసిన బుట్టా రేణుక జ‌గ‌న్ ఇప్ప‌టికే క‌ర్నూలు ఎంపీ అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించిన సంజీవ్ కుమార్‌కు వ్య‌తిరేకంగా త‌న అనుచ‌రుల‌తో ప్ర‌చారం చేయిస్తుంద‌ని, అదే స‌మ‌యంలో క‌ర్నూలు ఎంపీ టికెట్ త‌న‌కే కేటాయించాలంటూ బుట్టా రేణుక స్వ‌యంగా తాను డిమాండ్ చేయ‌కపోయినా త‌న అనుక‌ర‌గ‌ణంతో డిమాండ్ చేయిస్తుంద‌ట‌. దీంతో క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. బుట్టా రేణుక వైసీపీలోకి రావ‌డంతో క‌ర్నూలు ఎంపీ అభ్య‌ర్ధిగా అమెను ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అధిష్టానం ఏం చేస్తుందో అన్న‌దానిపై ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది. సంజీవ్‌కుమార్‌ను మార్చి బుట్టాకే మ‌ళ్లీ టికెట్ ఇస్తారా.? లేక ఆమెకు మ‌రో అవ‌కాశం క‌ల్పిస్తారా..? అన్న‌ది తేలాల్సి ఉంది.